Tuesday, March 27, 2018

వెన్నెముక


 నెల్లూరుకు సమీపంలోని రాజుపాలెం  అనే ఊరిలో రఘురామయ్య అనే రైతు వుండేవాడు. అయనకు యిద్దరు కొడుకులు. పెద్దవాడు ఆనంద్, చిన్నవాడు రాజేష్. యిద్దరినీ బాగా చది వించాలని, వారిద్దరు తనలాగా కాయ కష్టం చేయగూడదని మంచి స్కూల్లో చేర్పించాడు.
            పెద్దవాడికి  చదువు బాగా అబ్బింది. చిన్నవాడికి చదువులో పట్టు దొరకలేదు. ఆనంద్ శ్రద్ధగా చదివి
ఇంజనీరింగ్ లో పట్టా పొందాడు.పట్నంలో పెద్ద ఉద్యోగం సంపాదించాడు.అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతస్థాయికి చేరుకున్నాడు.
     రాజేష్ కి చదువు వంటబట్ట లేదు. ఎంతగా  బ్రతిమాలి  చెప్పినా తండ్రి మాటలు పెడ చెవిన బెట్టి స్కూలుకు  నామం  పెట్టి    తోటలమ్మట, పొలాలమ్మట  తిరిగి  చదువుకు  దూరమయ్యాడు.    చివరకు తండ్రికి  తోడుగా వ్యవసాయదారుడిగా మిగిలిపోయాడు.  
           ఆనంద్ ఉద్యోగంలో మంచి  స్థాయిలోకి వచ్చి, బాగా సంపాదించాడు. అయితే అతని ఉద్యోగానికి  ఒక సమయమంటూ లేదు. ఒక్కోసారి  రాత్రంతా పని చేయాల్సివచ్చేది. సమయంలో సరైన  వేళకి నిద్ర, ఆహారం ఉండేది కాదు. కానీ కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం  బాగా ముట్టేది. యెప్పుడూ మడత నలగని దుస్తుల్లో హుందాగా వుండేవాడు.
             రాజేష్  పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. పగలంతా పొలంలో కష్టపడేవాడు. ఉన్న పొలాన్ని శ్రద్ధగా సాగుచేసి  పంటలు  చేసేవాడు.వరి, కూరగాయలు బాగా పండించేవాడు. తిండికి బట్టకు యెలాంటి లోటూ లేక పోయినా  రాజేష్ మనసు కాస్త  బాధగానే వుండేది.
        తన అన్న ఆనంద్ బాగా చదువుకున్నాడు కాబట్టి పట్నంలో హాయిగా జీవిస్తున్నాడని, తనకు చదువు
లేనందున యిలా పల్లెటూర్లో  సేద్యం చేసుకోవాల్సి వచ్చిందని.. తనకు తాను తక్కువని భావించేవాడు.
           ఒకరోజు రాజేష్ తన  మేనమామ  రామారావుతో  తనలోని బాధను చెప్పుకొంటూ ..   " మావయ్యా.. నేను   కూడా  చదువుకొని వుంటే  అన్నయ్యలాగా  పట్నంలో  హాయిగా  ఉద్యోగం  చేసుకొనే వాడిని. నాన్న యెంతగా  చెప్పినా పెడచెవిన బెట్టి స్కూలుకు యెగనామం పెట్టి నందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాను”
 అన్నాడు.
        రాజేష్ మాటల్లోని వేదనను అర్ధం చేసుకున్న రామారావు.  “ ఒరేయ్..  రాజేష్ నీబాధ అర్ధం అయింది. నీ కంటే   పెద్దాడు   గొప్పగా వున్నాడని  అనుకుంటున్నావు.  నీకు నీవే  తక్కువుగా ఊహించుకొని బాధపడి పోతున్నావు.అవునా?”  అని అడిగాడు.
        “ నిజమే కదా మామయ్యా అన్నయ్య నాకంటే గొప్పగా జీవిస్తున్నాడుగా …!” చెప్పాడు
        “ నీ ఆలోచన తప్పు రాజేష్.  మీ అన్నయ్య కంటే  నీవే  గొప్పవాడివి.. " అన్నాడు.
       “ లేదులే  మావయ్యా నా తృప్తి కోసం అలా అంటున్నావు. అన్నయ్యకీ  నాకూ పోలికెక్కడ..!”  అన్నాడు.
      “ అదేనా  నీకు తెలిసింది. ఆనంద్ పట్నంలో ఉద్యోగం చేస్తూ డబ్బులు పండిస్తున్నాడు. నువ్వు పల్లెలో వ్యవసాయం చేసి   తిండిగింజలు పండిస్తున్నావు.  వాడు పండించే  డబ్బులు  తినడానికి  పనికిరావు.  వాడు  బ్రతకాలంటే  ఆహారం కావాలి.  తిండి లేక పోతే వాడు చచ్చి పోతాడు. వాడికి అక్కడ  తిండి కావాలంటే  నువ్వు పండించే ధాన్యమే దిక్కు. పెద్ద  పెద్ద చదువులు చదివిన అలాంటి ఉద్యోగులకే  కాదు. వ్యవసాయేతర  రంగంలో  పనిచేసే  ప్రతి ఒక్కరికీ తిండి పెట్టేది  నీలాంటి  రైతన్నలే. రైతన్నలు లేకపోతే అందరూ  ఆకలితో చచ్చిపోతారు. అందుకే ఉద్యోగికన్నా రైతేమిన్న. యెప్పటికీ  రైతేరాజు ..! దేశానికి రైతే వెన్నెముక " చెప్పాడు.
            మామయ్య మాటల్లోని వాస్తవం అర్ధం చేసుకున్న రాజేష్ అప్పటినుండి తనకు తాను తక్కువగా అంచనా వేసుకోవడం మానేశాడు. మరిన్ని మెళుకువలు పాటించి వ్యవసాయాన్ని వృద్ధి చేశాడు.*   

5 comments:

sam said...

dear sir very good blog and very good content
Suryaa News

Movie Masti said...

good afternoon
its a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..

https://www.ins.media/

Picture Box said...

good information blog
https://goo.gl/Ag4XhH
plz watch our channel

Picture Box said...

nice blog
https://youtu.be/2uZRoa1eziA
plz watch our channel

Unknown said...

nice blog
trendingandhra