తొందర పాటు..!
ఒకప్పుడు సింహపురి రాజ్యాన్ని విశ్వనాథుడనే రాజు పాలించే వాడు. ఆయన భార్య శకుంతలా దేవి చాలా కాలానికిగర్భవతి అయింది. తనకు వారసుడు రాబోతున్నాడని రాజు ఎంతో సంబర పడి పోయాడు.
కానీ ... ఆమెకు ఒక అండము పుట్టింది. ఇలా ఎందుకు జరిగిందో.. దాని ప్రభావ మెలా వుంటుందోనని భయముతో కంపించిపోయాడు విశ్వనాథుడు. దీని మూలముగా తనకు తన రాజ్యానికి ఏదైనా కీడు జరుగు తుందేమోనని ..... వెంటనే ఈపీడను వదిలించుకొని ....ఆపద నుంచి తప్పించుకోవాలను కొన్నాడు.
ఇద్దరు భటులను పిలిచాడు. వారితో.."ఈ అండాన్ని తీసుకెళ్ళి నదిలో పార వేయండి. మహా రాణిని తీసుకెళ్ళి దట్టమైనఅడవులలో జంతువులకు ఆహారంగా వదిలి వేయండి..." అని ఆజ్ఞాపించాడు.
అప్పటి వరకు మౌనంగా అంతా చూస్తున్న మంత్రి రాఘవేంద్రుడు జోక్యం చేసుకుని .. " మహారాజా...! తొందరపడకండి..అండాన్ని వదిలించు కొవడములో తప్పు లేదు. కానీ... ఏ పాప మెరుగని మహారాణికి అంత శిక్షఅవసరమా...! " అన్నాడు.
'' మహా మంత్రీ...! దోష పూరితమైన వాటిని వదిలించుకుంటేనే రాజ్యానికి క్షేమం . ఇందులో నా ఆజ్ణకి తిరుగు లేదు. వ్యక్తిగత బంధాలకన్నా ... రాజ్య క్షేమం నాకు ముఖ్యం.. " గంభీరంగా చెప్పాడు విశ్వనాథుడు.
రాఘ వేంద్రుడు మౌనంగా తలూపాడు. రాజు తన మందిరానికి వెళ్లి పోయాడు. రాజ భటులకు చెప్పాల్సింది చెప్పి పంపివేసాడు మంత్రి.
భటులు సూర్యోదయానికి ముందే అందాన్ని నదిలో పార వేసారు. మహారాణిని మాత్రం మంత్రి సూచన మేరకు ఒకమారు మూల ప్రాంతం లోని ఆయన అనుచరునికి అప్పగించారు.
నదిలో పడ వేసిన అండాన్ని ఒక చేప మ్రింగింది. అలా మ్రింగిన చేప తెల్లారగానే ఒక జాలరి విసిరిన వలలో చిక్కుకుంది. జాలరి దానిని ఇంటికి చేర్చి, పని మీద పొరుగూరు వెళ్ళాడు. జాలరి భార్య దానిని కత్తితో కోయగానే దానికడుపులో నుండి ధగ ధగ లాడుతూ అండం బయట పడింది. జాలరి భార్య దానిని తన భర్తకు చూపాలని ఒక బుట్టలోదాచింది.
సాయంత్రం ఇంటికి రాగానే భర్తకు విషయము చెప్పి బుట్ట మూత తెరిచింది. అందులో అందానికి బదులు చిరు నవ్వులుచిందిస్తూ మగ శిశువు కనిపించాడు. ఆశ్చర్యపోయిన జాలరి దంపతులు ... బిడ్డలు లేని తమకు దేవుడు ఇలాప్రసాదించాడని సంతోషంతో పొంగి పోయి విజయుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకో సాగారు.
ఆ తర్వాత రాజ ప్రాసాదములో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. భార్యను త్యజించిన రాజు మరో స్త్రీ ని వివాహంచేసుకున్నాడు. రెండో భార్య సోదరుడు బావ గారిపై పెత్తనం చెలాయించ సాగాడు. భార్య మైకంలో పడిన రాజు వాస్తవాలను గమనించక దుర్జయుడు చెప్పి నట్లు చేయ సాగాడు.
దుష్ట బుద్ది అయిన దుర్జయడు తన అక్రమ చర్యలను అడ్డుకుంటున్న మంత్రిని , ఇంకా అనేక మంది రాజ భక్తి కలిగినవారిని పదవుల నుండి తప్పించాడు. రాజ్య పాలన అంతా దుర్జయునిదే అయింది. రాజ్యం లో అరాచకం ప్రబలింది. రాజప్రాసాదము నుండి బయట పడిన మంత్రి మహారాణిని కలుసుకుని అన్ని విషయాలు వివరించాడు.
ఈ లోగా రాజ్యం లోని తూర్పు తీర ప్రాంతములో విజయుడనే యువకుడు కొంతమందిని కుడా గట్టుకుని అరాచకశక్తులపై తిరుగుబాటు చేస్తున్నాడనే విషయం మంత్రికి తెలిసింది. అతని ద్వారా తన సంకల్పం పూర్తిచేసుకోవచ్చుననేఆలోచనతో బయలదేరి విజయుని కలుసుకున్నాడు మంత్రి.
విజయుని చూడగానే మంత్రి ఆశ్చర్య పోయాడు. అందుకు కారణం... అతనిలో విశ్వ నాథుని పోలికలు కనిపించాయి. అనుమానం వచ్చిన మంత్రి.... జాలరి దంపతుల ద్వారా అసలు విషయం తెలుసు కున్నాడు.
విజయునికి సంగతంతా చెప్పాడు. తర్వాత మంత్రి, చక్కటి వ్యూహంతో విజయుని ద్వారా రాజ ప్రాసాదాన్ని ముట్టడించిదుర్జయుని బంధించాడు.
అండము ద్వారా కలిగిన విజయుని రాజుకి అప్పగించాడు. రాజు ఏం సంతోషించాడు.
తొందర పాటు నిర్ణయాన్ని తీసుకున్నందుకు పశ్చాత్తాప పడిన విశ్వనాథుడు తిరిగి శకుంతలా దేవిని స్వీకరించాడు. విజయునికి యువరాజు పట్టాభిషేకం జరిపించాడు. రాఘవేంద్రుని పర్య వేక్షణలో సింహపురి తిరిగి పూర్వ వైభవానికిచేరింది.
--- కైపు ఆదిశేషా రెడ్డి ( నెల్లూరు )
ఇది ' బుజ్జాయి ' పిల్లల మాస పత్రిక లో ప్రచురితమైనది.
Comments