రాజ కుమారినే పెళ్ళాడుతా...!
పుల్లయ్యని కాలు కింద పెట్టనిచ్చేవారు కాదు రామయ్య , సీతమ్మ దంపతులు. లేక లేక పుట్టిన కొడుకు మీద ప్రేమ వుండడం సహజమే కాని , మరింత ఎక్కువైతే ఎలా అనుకునేవారు చుట్టూ పక్కల వాళ్లు.
" సీతక్కా...! పుల్లయ్యని మరీ అంత ముద్దు చేయకు. రేపు పెద్దయ్యాక పనీ పాటా రాక పొతే పిల్లనేవరిస్తారు..! " అని ఓ సారి పక్కింటి రాధమ్మ చనువుగా హెచ్చరిస్తే సీతమ్మ వూరు కోలేదు.
" మా వాడి కేం బంగారం . చూస్తుండు.. వాడికి రాజ కుమారితో పెళ్ళవుతుంది.." అంది .
ఈ మాటలు విన్న పుల్లయ్య " అవును.. నేను లాకుమాలిని పెళ్ళాడుతా... " అన్నాడు ముద్దు ముద్దుగా.
అప్పటి నుండి బంధువులంతా వాడిని... " ఒరేయ్.. ఎవరిని పెళ్లాడుతావురా...." అని అడిగి వాడి సమాధానం విని నవ్వుకునే వారు.
తల్లి దండ్రుల అతి గారాబం వలన పుల్లయ్యకు పెద్దయినా బరువు భాద్యతలు ఏవీ తెలియ రాలేదు. ఓ సారి సీతమ్మ వాడిని చేరబిలిచి.. " నాయనా...! నాకు వయసాయి పోయింది... నీకు పెళ్లి చేయాలను కుంటున్నాను.. " అంది.
" మరి..ఈ సంగతి రాజకుమారికి చెప్పావా...? " అన్నాడు పుల్లయ్య.
సీతమ్మ తెల్లబోయింది.
విషయం తెలిసి రామయ్య " ఒరేయ్.. మనమెక్కడ..? రాజకుమారి ఎక్కడ..? నీకు నచ్చిన పిల్లనే చేస్తాములే.. " అంటూ నచ్చజెప్ప పోయాడు.
పుల్లయ్య ససేమిరా వినలేదు. " నాకు అదంతా తెలియదు..రాజకుమారి అయితేనే ..పెళ్లి చేసు కుంటా .. " అని బయటికి వెళ్లి పోయాడు.
ఆ దంపతులు తలలు పట్టుకున్నారు.
పొరుగూరు నుండి పని మీద వచ్చి ఇంట్లో బస చేసిన దూరపు సోమయ్యకి సంగతంతా చెప్పుకుని బాధ పడ్డారు రామాయ, సీతమ్మ.
" మీరేమీ దిగులు పడకండి..పుల్లయ్య పెళ్లి నేను జరిపిస్తానుగా..." అని భరోసా ఇచ్చాడు సోమయ్య.
సోమయ్య ఆ సాయంత్రం వూరెళుతూ..పుల్లయ్య తో .. " బాబూ...! పెళ్ళెప్పుడు చేసు కుంటావు... ?" అని అడిగాడు.
" రాజకుమారి దొరికితే ... వెంటనే.. " అన్నాడు పుల్లయ్య.
" మరి రాజకుమారి ఎలా వుంటుందో ...ఎక్కడ వుంటుందో...తెలుసా....? " అని అడిగాడు సోమయ్య.
' నాకేమి తెలుసు...తెలిస్తే ...వెళ్లి చేసుకునే వాడినిగా...! " అన్నాడు పుల్లయ్య.
" సరే...! నేను వెళ్లి రాజకుమారి తో మాట్లాడి వస్తాను. " అన్నాడు సోమయ్య.
పుల్లయ్య సంబరంగా తలూపాడు.
రెండు రోజుల తర్వాత సోమయ్య మళ్ళీ వచ్చి .." పుల్లయ్యా..! రాజకుమారి వూరి బయట తోటలోకి విహారానికి వస్తుంది. నాతో వస్తే చూపిస్తాను.. " అంటూ వెంట తీసికెళ్ళాడు.
ఇద్దరూ తోటలో ఓ గుబురు పక్కన కూర్చుని ఎదురు చూడసాగారు.
కాసేపటికి గల గల నవ్వుతూ నలుగురు అమ్మాయిలు అటుకేసి వచ్చారు.
" వీరిలో..రాజకుమారి ఎవరు..? " అన్నాడు పుల్లయ్య.
" అదిగో...! ఆ ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయే ...! " అన్నాడు సోమయ్య.
అంతలో ఆ అమ్మాయి తూలి పడబోయి.. నిలదొక్కు కుంది.
" అమ్మా..! రాజ కుమారీ...కాస్త మెల్లగా నడువ్.. పెళ్లి కావలసిన దానివి..." అని మరో నవ్వింది.
" మన రాజకుమారికి ఏమి తక్కువ ... ఎ పుల్లయ్యో వచ్చి ఎగరేసుకు పోతాడు.. " మరో అమ్మాయి.
" ఓ యబ్బో...! ఆ పుల్లయ్య దొరకాలిగా...అప్పుడు చూద్దాం... " అని రాజకుమారి పకపక నవ్వింది.
ఆ అమ్మాయిలు అలా వెళ్లి పోగానే.. సోమయ్య " రాజకుమారి నచ్చిందా...! ఆమెకి కూడా పుల్లయ్యే కావాలట .." అన్నాడు.
పుల్లయ్య వెంటనే పెళ్ళికి ఒప్పుకున్నాడు.
సోమయ్య జరిగినదంతా రామయ్య దంపతులకు చెప్పి " మా అమ్మాయి పేరు రాజకుమారే.....!మీ ఇంట్లో అయితే అది సుఖంగా వుంటుందని ఇలా చేశాను. మీ వాడికి లోక జ్ఞానం లేదేమో గాని ...బుద్దిమంతుడు. తెలివైన నా కూతురు వాడిని దారిలోకి తెస్తుందని నా నమ్మకం.. " అని వివరించాడు.
వాళ్లు సంతోషంగా ఒప్పుకోవడం తో వెంటనే పెళ్లి జరిగి పోయింది.
ఆ తర్వాత స్నేహతులు .... " ఎరా... రాజకుమారిని పెళ్ళాడతాననే వాడివి..." అని అడిగితే...'' పొండిరా.... రాజకుమారిని అన్నానే కాని.. రాజుగారి కూతురు అన్నానా...." అని బదులు చెప్పే వాడు.
( ఈ కథ 'ఈనాడు' దిన పత్రికలోని ' హాయ్..! బుజ్జీ .!' విభాగం లో ప్రచురింప బడినది.)
---- కైపు ఆదిశేషా రెడ్డి. ( నెల్లూరు )
Comments