పరివర్తన

  

           రాజా రావు మాష్టారు రామాపురం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఒకరోజు ఉదయం మూడో పీరియడ్ ఖాళీగా వుండటంతో, విశ్రాంతి గది లోంచి  వెలుపలకు, వచ్చి వరండాలో నిల్చొని  నలువైపులా తేరిపార  చూస్తున్నంతలో దూరంగా పడి పోయి వున్న ప్రహరీగోడ అవతల యిద్దరు పిల్లలు తచ్చాడుతూ కనిపించారు.

      అప్పుడప్పుడూ కొందరు పిల్లలు హోమ్ వర్క్ బారినుండి తప్పించుకునేందుకు క్లాసులు ఎగ్గొట్టి గోడవతల చేరి లాంగ్ బెల్ అయ్యాక లోపలకు రావటం చేస్తూవుంటారు. పిల్లలు కూడా అలా  వెళ్లుంటారని భావించి నడచుకుంటూ ప్రహరీ వైపు నడిచాడు రాజా రావు మాష్టారు.

       గోడ సమీపానికి వెళ్ళగానే.. అటువైపు నుండి సిగరెట్ వాసనతో కూడిన పొగ రావటం కనిపించింది. ఆశ్చర్యపోతున్నంతలో పిల్లల మాటలు వినిపించడంతో ఆగి పోయాడు.

       ఒరేయ్ రాజూ.. ! నాకు భయం వేస్తుందిరా.. మాస్టారైనా చూస్తే తాట తీస్తార్రా .. !"

       ఎందుకురా భయం. మనమేం చేస్తున్నాం. జస్ట్ సిగరెట్  కాలుస్తున్నాం ..  అంతే..!”

రాజు నిర్లక్ష్యం గా చెప్పాడు.

       “ సిగరెట్ కాల్చడం తప్పుకదట్రా..? ”

        “  మొన్న రాజారావు మాష్టారికి నేనే సిగరెట్ ప్యాకెట్ బాషా అంగట్లో తెచ్చిచ్చాను. నా  ముందరే  సిగరెట్ వెలిగించుకొని, నోట్లోంచి పొగను రింగులు రింగులుగా వదులుతూ వుంటే.. చూడ్డానికి యెంత బాగుండిందో.. నీకేం తెల్సు…!  సిగరెట్ తాగటం తప్పయితే సారెందుకు తాగుతాడు. అప్పటినుండి.. సార్ లా సిగరెట్ కాల్చి పొగను యిలా రింగులు రింగులుగా వదలాలనేది  నా కోరిక..” చెప్పుకు పోతున్నాడు రాజు.  

         వింటున్న రాజారావు మాష్టారికి తల తిరిగినట్లనిపించింది. దిగ్భ్రాంతికి గురై, అక్కడ

  నిల్చోలేక వెనక్కి తిరిగి వడివడిగా విశ్రాంతి గదిలోకొచ్చి... అర బాటిల్ నీళ్ళు గడగడా త్రాగి, కుర్చీలో కూలబడ్డాడు.

          నాలుగు  రోజుల క్రితం  సంఘటన గుర్తొచ్చింది.  ఆరోజు తను ఇంటర్వెల్ లో రాజు అనే తొమ్మిదో తరగతి విద్యార్ధిని పిలిచి, “ రాజూ.. బాషా బంక్ దగ్గరకెళ్ళి, నామీద చెప్పి ఒక గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ పెట్టె తీసుకురా.. " చెప్పాడు.

        రాజు తెచ్చిన సిగరెట్ ప్యాకెట్ లోంచి ఒక సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుంటూ.. “ రాజూ అదిగో అల్మారాలో అగ్గిపెట్టె వుంది యిటివ్వుఅన్నాడు.

          రాజు  అగ్గిపెట్టె  యిచ్చాడు.  తను సిగరెట్ ముట్టించి, పొగను రింగులు రింగులుగా వదులుతూ తనలో తాను  లీనమై పోయాడు. యిదంతా  రాజు  గమస్తున్నాడని  తాను అనుకోలేదు.

          రాజారావులో  అంతర్మథనం  ప్రారంభమైంది. అవును తను తప్పు చేశాడు. పిల్లల యెదుట చేయకూడని తప్పు చేయడమే కాక, సిగరెట్ కూడా  వారి చేతనే తెప్పించుకున్నాడు. తను విద్యార్ధి ముందు అలా చేయడం వల్లే, తనని మోడల్ గా తీసుకొని చెడుకు ఆకర్షితు

డైనాడు. రోజు రాజు, రేపు మరెవరైనా తన ప్రవర్తనకు ఆకర్షితులు అయ్యే అవకాశముంది. తమకి  పాఠాలు, నీతులు  చెప్పేవారు  చేసే  ప్రతి  పని వారికి  సమంజసంగానే అనిపించడం  

సహజం. అది తప్పు కాదని వారికి అనిపించిందంటే..దానిని అనుకరించక మానరు.  పిల్లలు అనుకరణలో అసాధ్యులు.

         యిలా ఆలోచిస్తున్న రాజారావు మాష్టారిలో పరివర్తన మొదలైంది. తనవల్ల తన చెడు అలవాట్ల వల్ల పిల్లలు పాడవకూడదు.తాము విద్యార్థులకు చక్కటి మార్గదర్శకులుగా వుండాలి

గాని,  చెడు వైపు మళ్ళేలా చేయడం  మంచిది కాదు.  యిక ముందు  పిల్లల ముందు  కాదు.. అసలే  వీటిని  ముట్టుకోకూడదు.  పిల్లలకు నీతి బొధించాల్సిన  తనే  వారినుండి గుణపాఠం నేర్చుకొవాల్సి వచ్చింది అనుకుంటూ లేచి, తన పాకెట్ లోని సిగరెట్ పెట్టెని, అగ్గి పెట్టెని పొడిగా నలిపి డస్ట్ బిన్ లో వేశాడు. అప్పుడు గాని ఆయన  మనసు ప్రశాంతత పొందలేదు.*


          

  

Comments

Popular posts from this blog

తొందర పాటు..!

ఉత్తమ చెట్టు

వెన్నెముక